: ప్రపంచంలో అతిపెద్ద అమ్మవారి విగ్రహం ఇదే: అమితాబ్ బచ్చన్
ప్రపంచంలో అతి పెద్ద దుర్గామాత విగ్రహం ఇదేనంటూ ఆ ఫొటోను ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తయిన దుర్గామాత విగ్రహాన్ని దక్షిణ కోల్ కతాలో ఏర్పాటు చేశారు. సుమారు రెండు నెలల పాటు కష్టించి 88 అడుగుల ఎతైన అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. దీనిని తయారు చేసేందుకు 40 మంది కళాకారులు శ్రమించారు. ఆ విగ్రహం ఫొటోతో పాటు, ప్రపంచంలో అతిపెద్ద అమ్మవారి విగ్రహం ఇదేనంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో నిన్న అక్కడికి వెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో సుమారు 11 మంది గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా దర్శనాన్ని పోలీసు అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా ప్రత్యేక పూజలు జరగనున్నందున భక్తులు అధికంగా వచ్చారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు.