: బాలీవుడ్ హీరో సోదరికి ముంబై రౌడీ ఝలక్!
బాలీవుడ్ హీరో సాహిల్ ఖాన్ సోదరి షయిస్టాకు ముంబై గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్ మరచిపోలేని ఝలక్ ఇచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షయిస్టా తన మెర్సిడిస్ బెంజ్ కారును విక్రయించాలని భావించి ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. దీన్ని గమనించిన అఫ్తాబ్, కారును కొనుగోలు చేస్తానని ఆమెకు ఫోన్ చేశాడు. రూ. 42 లక్షలకు కారును కొనేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. కొందరు స్నేహితులతో వచ్చి, అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చి టెస్టు రైడ్ కు వెళ్లి వచ్చాడు. పూర్తి డబ్బిచ్చి కారును తీసుకెళ్తానని నమ్మబలికాడు. మిగతా డబ్బు చెల్లించాలని షయిస్టా ఫోన్ చేయడంతో మరోసారి ఆమె దగ్గరకు వచ్చి, ఇంకోసారి పరీక్షించి చూస్తానని చెప్పాడు. కారు తీసుకుని అటునుంచి అటే ఉడాయించాడు. కారు కొనుగోలుదారు తిరిగొస్తాడని ఎదురుచూసి విసిగిపోయిన షయిస్టా, సమాచారాన్ని తన అన్నకు చేరవేసింది. ఇప్పుడీ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, అఫ్తాబ్ పలు కేసుల్లో నిందితుడని, ముంబై నగర బహిష్కరణ శిక్షను అనుభవిస్తున్నాడని తెలుస్తోంది.