: ప్లాట్ ఫాం టికెట్ మరింత భారం... రైల్వే స్టేషను లోపలికి వెళ్లేందుకు మరో చౌక మార్గం!
పండగ వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందన్న కారణం చూపుతూ, సందర్శకులను నియంత్రిస్తామంటూ రైల్వే శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. రూ. 10గా ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను రెట్టింపు చేసి రూ. 20గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీ వరకూ ఇదే ధర సికింద్రాబాదు స్టేషనులో అమలవుతుందని తెలిపింది. తమ వారిని రైళ్లలో ఎక్కించేందుకు, ఊర్లకు వెళుతున్న వారికి వీడ్కోలు పలికేందుకు స్టేషనుకు వస్తున్న వారు ఇది తెలుసుకుని అధికారుల తీరును విమర్శించారు. ఇదే సమయంలో కొందరు తమ తెలివితేటలకు పని పెట్టారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బేగంపేటకు రూ. 5 పెట్టి ఎంఎంటీఎస్ టికెట్ తీసుకుని దర్జాగా లోపలికి వెళ్లి పోయి తమ పని చూసుకున్నారు. తిరిగి అంతే దర్జాగా బయటకు వెళ్లిపోయారు. ఆ విధంగా రూ. 20 పెట్టి ప్లాట్ ఫాం టికెట్ కొనాల్సిన అవసరం వారికి లేకపోయింది. అధికారులకు విషయం తెలిసి వారిని అడ్డుకోవాలని చూసినా అందుకు ఎటువంటి నిబంధనలూ లేకపోవడంతో ఊరకుండిపోయారని తెలుస్తోంది.