: పవన్ కల్యాణ్ వస్తారనే ఆశిస్తున్నాం: యనమల
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కు మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడులు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. అంతకుముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి, అమరావతికి ఆహ్వానించారు. ఈ క్రమంలో, రాజధాని శంకుస్థాపనకు రావాలని తనకు కూడా ఉందని... అయితే, షూటింగ్ కారణాల వల్ల తాను హాజరవుతానో, లేదో కచ్చితంగా చెప్పలేనని పవన్ తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ తప్పకుండా హాజరవుతారని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద మట్టిని, నిజాంసాగర్ నీటిని ఆయన సేకరించారు. ఇదే సమయంలో, వైకాపా అధినేత జగన్ పై ఆయన మరోసారి మండిపడ్డారు. జగన్ వ్యవహారశైలిని చూసి, ఆయన పార్టీ నేతలే విస్తుపోతున్నారని అన్నారు.