: మోసుల్ నుంచి అష్టకష్టాలతో 'గ్రేట్ ఎస్కేప్'!
మోసుల్... ఇరాక్ తూర్పు ప్రాంతంలో ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న నగరం. ఈ నగరంలో ప్రజల జీవన విధానం ఎలా ఉందన్న దానిపై ఇప్పటికే ఎన్నో వాస్తవ కథలు వెలుగులోకి వచ్చాయి. మనుషులను భవంతులపై నుంచి పడేసి చంపడం, బహిరంగంగా ఉరిశిక్షలు విధించడం, తమ మాట వినకుంటే తీవ్ర శిక్షలు విధించడం, బందీలుగా పట్టుబడిన వారికి క్రూరాతిక్రూరమైన శిక్షలు... ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుసు. మోసుల్ లో ఉండలేక, అక్కడి నుంచి బయటపడే మార్గం లేక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఎవరైనా బయటపడేందుకు ప్రయత్నించి పట్టుబడితే, తక్షణ మరణశిక్షే. అయినప్పటికీ, కొందరు ప్రాణాలకు తెగించే సాహసం చేసి బయటపడ్డ వారున్నారు. అటువంటి వ్యక్తి కథే ఇది. మోసుల్ నుంచి బయటపడి, రెండు దేశాలు దాటి, తిరిగి ఇరాక్ లోని సురక్షిత ప్రాంతానికి వచ్చిన ఆ వ్యక్తికి లభించిన బహుమానం జైలుశిక్ష. మరిన్ని వివరాల్లోకి వెళితే... జూన్ 2014లో ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. వేతనాలు లేకుండా వైద్యులు, టీచర్లు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ఐఎస్ఐఎస్ ఏం చెబితే అది జరగాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడో చుక్కలను తాకేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక అక్కడ ఉండరాదని, ఎలాగైనా ప్రాణాలతో బయటపడితే చాలని ఓ మాజీ టాక్సీ డ్రైవర్ భావించాడు. మోసుల్ నుంచి ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు ఆరు గంటల పాటు ప్రయాణిస్తే సరిపోతుంది. కానీ అది అసంభవం. ఆ దారిలో బయలుదేరితే గంటలోనే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే ఈ వ్యక్తి తొలుత సిరియాకు, అక్కడి నుంచి టర్కీకి వెళ్లి, ఆపై బాగ్దాద్ కు రావాల్సి వచ్చింది. తన పేరును బయటపెడితే, మోసుల్ లో ఉన్న తన బంధువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారని చెప్పిన ఈ వ్యక్తి తాను ఎన్ని కష్టాలతో అక్కడి నుంచి బయటపడ్డాడో స్వయంగా వివరిస్తూ, "నేను బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం స్మగ్లర్లను ఆశ్రయించడం. కేవలం వ్యాపార వేత్తలకు, వైద్యం నిమిత్తం వెళ్లే వారికి మాత్రమే నగరం దాటే అనుమతి లభిస్తుంది. అది కూడా వారి ఆస్తులనన్నింటినీ తాకట్టుగా పెడితేనే. నేనూ ప్రాణాలను పణంగా పెట్టి స్మగ్లర్లను ఆశ్రయించాను. నా స్నేహితుడికి స్నేహితుడైన ఓ ఐఎస్ఐఎస్ ఫైటర్ డబ్బు తీసుకుని స్మగ్లర్ల ద్వారా ప్రజలను నగరం దాటిస్తున్నాడని తెలుసుకున్నాను. దాదాపు 1000 డాలర్లు ఇచ్చిన తరువాత నా ప్రయాణం మొదలైంది" అని జరిగిన ఘటనలు గుర్తు తెచ్చుకున్నాడు. "నా ప్రయాణం అంత సులభం కాదని తెలుసు. పట్టుబడితే ప్రాణాలు పోతాయని తెలుసు. ఉగ్రవాదులతో సంబంధమున్న స్మగ్లర్ల టీం దొరికింది కాబట్టి చెక్ పోస్టులను తప్పించుకునే మార్గాలు సులువు. తొలుత మా గ్రూప్ లో ముగ్గురం మాత్రమే ఉన్నాం. మోసుల్ నగరాన్ని దాటి ఓ సురక్షిత ప్రాంతానికి చేరాక అక్కడ మరో రెండు కుటుంబాలు కలవడంతో 11 మందిమి అయ్యాము. ఐదు రాత్రుల పాటు ఎక్కడ తిరుగుతున్నామో తెలియని స్థితిలో ప్రయాణం చేసి రఖ్ఖా మీదుగా సిరియాలోకి ప్రవేశించాం. నేను తొలిసారిగా ఇరాక్ దాటింది ఆనాడే. మా కళ్ల ముందే బాంబులు పేలుతున్నాయి. ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు కూడా. రఖ్ఖా దాటిన తరువాత మరో స్మగ్లర్ల బ్యాచ్ కి మమ్మల్ని అప్పగించారు. అప్పటికి మాతో పాటు ప్రయాణిస్తున్న వారి సంఖ్య 50కి పెరిగింది. ఓ గనుల ప్రాంతం గుండా మమ్మల్ని నడిపించారు. మొత్తం 8 రోజుల ప్రయాణం తరువాత టర్కీలోని అంకారాకు చేరాము. అక్కడి ఇరాకీ ఎంబసీలో నెల రోజులు నిరీక్షిస్తే, విమానం ఎక్కి ఇరాక్ వెళ్లేందుకు అనుమతి లభించింది" అని తెలిపాడు. కథ ఇక్కడితో ముగియలేదు. స్వదేశంలోని సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఆనందంగా జీవించాలన్న అతని ఆశలు అడియాసలయ్యాయి. అంకారా నుంచి బాగ్దాద్ కు విమానంలో రాగానే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మోసుల్ నుంచి రావడమే ఇందుకు కారణంగా పోలీసులు చెప్పారట. చట్టానికి వ్యతిరేకంగా దేశం దాటి వెళ్లాడన్న ఆరోపణలు మోపారు. "మేము ఇరాక్ వాసులం కాదన్నది వారి అభిప్రాయంగా అనిపించింది" అని ఆ మాజీ టాక్సీ డ్రైవర్ తెలిపాడు. మొత్తం 8 రోజుల పాటు జైల్లో ఉన్న అనంతరం, విడిచిపెట్టినా అతనిపై ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఐఎస్ఐఎస్ అధీనంలోని ప్రాంతంలో అష్టకష్టాలు పడటం కన్నా, బాగ్దాద్ లో పోలీసు కేసులున్నా, మరికొన్ని రోజుల తరువాతైనా ఆనందంగా గడపవచ్చన్నది అతని ఆలోచన.