: పట్టు వస్త్రాలంటూ, ఇంత నాసిరకమా? వడియాలు పెట్టుకోవడానికి కూడా పనికిరావంటున్న రైతులు!


నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతులను శంకుస్థాపనకు స్వాగతం పలుకుతూ, ఇస్తున్న పట్టుచీర, ధోవతులు అత్యంత నాసిరకంగా ఉన్నాయని రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు చౌక దుస్తులు ఇచ్చి అవమానిస్తున్నారని తుళ్లూరు మండల రైతులు ఆరోపించారు. మంత్రులు చెప్పినట్టుగా వీటి ఖరీదు రూ. 2,300 కాదుకదా, రూ. 700 కూడా విలువ చేయవని తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతుల మధ్యలో కూడా ఏపీ సర్కారు తేడాలు చూపిందని వారు దుయ్యబట్టారు. మంత్రులు నేలపాడులో పంపిణీ చేసిన వస్త్రాలు మాత్రమే నాణ్యంగా ఉన్నాయని, మిగతా అన్ని చోట్లా అధికారులు ఇస్తున్న దుస్తులు ఎంతమాత్రమూ బాగాలేవని తెలుస్తోంది. తుళ్లూరు మండలంలోని అబ్బరాజుపాలెం, అనంతవరం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల రైతులు తమకిస్తున్న పట్టు చీర, ధోవతులు అక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక అనంతవరం గ్రామ రైతులైతే, ఇవి తమకు వద్దంటూ సీఆర్డీయే అధికారుల ముందు వాదనకు దిగి వాటిని వెనక్కిచ్చేశారు. వీటిని వడియాలు పెట్టుకునేందుకు కూడా వాడలేమని గొడవకు దిగారు. దీంతో కంగుతిన్న అధికారులు వేరే వస్త్రాలు తెప్పిస్తామని చెప్పి వాటిని వెనక్కు తీసుకెళ్లారు. తొలి రెండు రోజులూ చీర, ధోవతిలతో పాటు స్వీట్ బాక్స్ ఇచ్చిన అధికారులు ఆదివారం నాడు దాన్ని విస్మరించడం కూడా విమర్శలు లేవనెత్తింది. ఇది తమను అవమానించడమేనని రైతులు ఆరోపించారు. తొలుత ఇచ్చిన ఆహ్వాన పత్రికల్లో రెండు పాస్ లను ఇచ్చిన అధికారులు, ఇప్పుడు ఒకే పాస్ పెట్టడాన్ని కూడా రైతులు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News