: ‘నడిగర్’ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ చిత్తు...అధ్యక్షుడిగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నిక


మాటల తూటాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెర లేపిన నడిగర్ (దక్షిణ భారత నటీనటుల సంఘం) ఎన్నికల్లో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్న ఆయన ఈ దఫా చిత్తుగా ఓడిపోయారు. నడిగర్ సంఘం కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంగా నడిగర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరత్ కుమార్ నాయకత్వాన్ని యువ హీరో విశాల్ ప్రశ్నించాడు. అంతేకాక శరత్ కుమార్ కు పోటీగా బరిలోకి దిగాడు. దీంతో దాదాపుగా చాలా కాలంగా ఏకగ్రీవంగా ముగుస్తున్న ఈ ఎన్నికలకు ఈ ఏడాది పోలింగ్ నిర్వహించక తప్పలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి. వ్యక్తిగత విమర్శలకూ దిగాయి. నిన్న పోలింగ్ సందర్భంగా విశాల్ పై శరత్ కుమార్ వర్గం దాడికి కూడా దిగింది. పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కంపు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ముగిసింది. ఈ ఎన్నికల్లో విశాల్ వర్గం శరత్ కుమార్ వర్గంపై విజయ దుందుభి మోగించింది. నడిగర్ సంఘం కొత్త అధ్యక్షుడిగా నాజర్ ఎన్నిక కాగా, శరత్ కుమార్ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మిగిలిన అన్ని పోస్టుల్లోనూ విశాల్ వర్గం సభ్యులే విజయం సాధించారు.

  • Loading...

More Telugu News