: హీరో విశాల్ పై శరత్ కుమార్ వర్గీయుల దాడి!
ప్రముఖ సినీ నటుడు విశాల్ పై సీనియర్ నటుడు శరత్ కుమార్ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటన చెన్నయ్ లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న పాఠశాలలో జరిగింది. దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయం కాగా, ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే శరత్ వర్గీయులు తమపై దాడి చేశారని విశాల్ విమర్శించారు. భారీగా పోలీసులు మోహరించిన ప్రాంతంలో ఈ తరహా దాడి జరగడం కలకలం రేపింది. కాగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో వందలాది మంది చిత్ర సీమ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో శరత్ వర్గం, విశాల్ వర్గం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.