: తిరుమలకు చంద్రబాబు, విజయవాడకు చినరాజప్ప, వరంగల్ కు వెంకయ్యనాయుడు... నేతల బిజీ టూర్లు
సాధారణంగా సెలవు తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకునే ఆదివారం నాడు పలువురు రాజకీయ నేతలు బిజీ షెడ్యూళ్లతో గడుపుతున్నారు. తన మనవడి అన్నప్రాసన నిమిత్తం చంద్రబాబు తిరుమలకు చేరుకోగా, ఆయన కన్నా ముందే ఈ వేడుకలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, నేతలు తిరుమలకు వెళ్లారు. ఇక విజయవాడలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరిద్దరూ రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు వరంగల్ లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా, 'హృదయ్' పథకాన్ని ఆయన ప్రారంభించి, ఆపై భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడిని సందర్శించనున్నారు. తెలంగాణలో పలువురు నేతలు నేడు బతుకమ్మ సంబరాల్లో బిజీగా ఉన్నారు. కాగా, తిరుమలలో వేడుకల అనంతరం చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ను స్వయంగా కలిసి రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాలు అందించనున్నారు.