: చెప్పింది చేయకుంటే తప్పుకోవాల్సిందే: రజనీకాంత్
నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. ఈ ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినీ పరిశ్రమంతా ఓ కుటుంబమని అన్న ఆయన, ఎన్నికలు, అందుకు సంబంధించిన ఆరోపణలు తాత్కాలికమని అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు చిత్ర ప్రముఖులు క్యూ కట్టారు. చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పోలింగ్ ప్రారంభం కాగా, తమ అభిమాన నటీ నటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా, ఆ వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మాజీ న్యాయమూర్తి పద్మనాభన్ వ్యవహరిస్తున్నారు.