: స్మృతీ ఇరానీ ఇచ్చే మాస్టర్స్ డిగ్రీ పట్టా అక్కర్లేదన్న ఎంబీఏ విద్యార్థి!
ఇండియాలో ప్రజా స్వాతంత్ర్యం విఘాతంలో పడిందని ఆరోపిస్తూ, కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా ఇచ్చే డిగ్రీ తనకు అక్కర్లేదని స్పష్టం చేశాడో ఎంబీఏ విద్యార్థి. కాశ్మీర్ లోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి బ్యాచ్ లో సమీర్ గోజ్వారీ అనే యువకుడు ఎంబీఏ చదివి ఉత్తీర్ణుడయ్యాడు. "ఓ విద్యార్థిగా మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం కంటే ఆనందం ఇంకోటి ఉండదు. కానీ, సోమవారం జరిగే స్నాతకోత్సవంలో ఇచ్చే ఆ పట్టా నాకు అక్కర్లేదు" అని సమీర్ తెలిపాడు. కాగా, ఈ కార్యక్రమానికి స్మృతీ హాజరవుతారా? లేదా? అన్న విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. మంగళవారం నాడు ఆమె సెంట్రల్ యూనివర్శిటీ కాశ్మీర్ కాంప్లెక్స్ కు గండేర్బల్ లో శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం నాడు జరిగే ఇస్లామిక్ వర్శిటీ తొలి స్నాతకోత్సవానికి ఓ కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం ఉండటంతో, ఈ కార్యక్రమానికి కూడా స్మృతీ వస్తారని భావిస్తున్నారు.