: గుర్రాలపై తిరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, పోలీసుల పుత్రరత్నాలు


హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో గుర్రాలపై స్వారీలు చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న పలువురు యువకులను పోలీసులు ఈ తెల్లవారుఝామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు, పోలీసు అధికారుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్ లో భాగంగా చాంద్రాయణ గుట్ట, బార్కస్, ఫలక్ నుమా తదితర ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 12 హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, స్నూకర్ కేంద్రాలపై దాడులు చేశారు. మొత్తం 230 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. 11 గుర్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పలు బ్లాక్ పల్సర్ బైక్ లు కూడా పట్టుబడటంతో, వీరిలో ఎవరైనా చైన్ స్నాచర్లు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి ఈ ఉదయం బార్కస్ మైదానంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు వివరించారు. ఇదిలావుండగా, రాయదుర్గంలో జరిపిన కార్డన్ సెర్చ్ లో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగగా, సరైన పత్రాలు లేని 40 బైక్ లు, ఆరు ఆటోలు, పలు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని, 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News