: ముస్లిం మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు అంటూ దుర్భాషలాడిన మహిళ
లండన్ నగరంలో తనతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ముస్లిం మహిళలను ఓ బ్రిటీష్ మహిళ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోల్చింది. వారి భాషలో వారు మాట్లాడుకుంటుండటాన్ని కూడా సదరు బ్రిటీష్ మహిళ తప్పుబట్టింది. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, వారి ఫొటోలను కూడా ఫోన్ లో చిత్రీకరించింది. "మీ దేశాలకు మీరు వెళ్లిపోండి. మీరు వెళ్తే మేము ప్రశాంతంగా బతుకుతాం. మీ దుస్తుల్లో బాంబులేమైనా దాచుకున్నారా?" అంటూ వారిపై విరుచుకుపడింది. ఓవైపు డ్రైవర్ వారిస్తున్నా ఆమె ఆగలేదు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ నేపథ్యంలో, లండన్ లోని విల్లెస్ డెన్ ప్రాంతంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరపుతున్నారు.