: డ్రైవర్ మద్యపానమే ‘ప్రకాశం’ ప్రమాదానికి కారణమట...15కు చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవరే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫుల్లుగా మద్యం సేవించిన డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు దాదాపుగా ఓ నిర్ధారణకు వచ్చారు. హైదరాబాదు నుంచి కందుకూరు బయలుదేరిన శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు చెర్లోపల్లి వద్ద పెళ్లి బృందంతో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యానును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య గంటగంటకూ పెరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు చనిపోగా, ఆ తర్వాత మరో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 15కు చేరింది. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ ఏమయ్యాడనే విషయం ఇప్పటిదాకా తేలలేదు.