: ‘ప్రకాశం’ ప్రమాదంపై మంత్రి శిద్ధా దిగ్భ్రాంతి... 14కు చేరిన మృతుల సంఖ్య


ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరారు. అదే సమయంలో అధికారులకు ఫోన్ చేసిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది గాయపడ్డారని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులందరినీ కందుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా డీసీఎం వ్యాన్ లోని పెళ్లి బృందం సభ్యులేనని తెలుస్తోంది. మరోవైపు వధువు, వరుడు అంతకుముందే మరో వాహనంలో వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఖాళీగా ఉండటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఎగసిన మంటల్లో బస్సు పూర్తిగా కాలిబూడిదైంది.

  • Loading...

More Telugu News