: మరో వివాదంలో చిక్కుకున్న రాధేమా


డబ్బుల కోసం డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు మొదలైన నేరాలు, కేసుల్లో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాధేమా చేతిలో త్రిశూలంతో పాటు విమానంలో ప్రయాణించిందంటూ వేసిన పిటిషన్ పై ఈరోజు బాంబే హైకోర్టు స్పందించింది. ఈ విషయమై ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 18వ తేదీలోగా సమాధానం చెప్పాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుంచి ముంబైకి ఓ ప్రయివేట్ విమానంలో రాధే మా ప్రయాణించింది. ఆ సమయంలో ఆమె చేతిలో త్రిశూలం ఉంది. మారణాయుధం లాంటి త్రిశూలంతో ప్రయాణించడం చట్టరీత్యా నేరమంటూ సామాజిక కార్యకర్త రమేష్ జోషి ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. రాధేమా మినిస్కర్ట్ లో ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బయటపడినప్పటి నుంచి ఆమెను పలు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News