: ఉద్యోగులకు కంపెనీలో వాటా ప్రకటించిన అనిల్ అంబానీ
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ సంస్థ రియలన్స్ క్యాపిటల్ లో ఉద్యోగులకు వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా అన్ని రిలయన్స్ క్యాపిటల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంపిక చేసిన ఉద్యోగులకు రూ. 150 కోట్ల విలువైన వాటాలను ఇవ్వనున్నట్టు సంస్థ వైస్ చైర్మన్ అమితాబ్ ఝున్ ఝున్ వాలా వెల్లడించారు. రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థలైన రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్ మెంట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు చెందిన 250 మందికి వాటాలివ్వనున్నట్టు తెలిపారు. వారి పనితీరు, నైపుణ్యానికి ప్రతిఫలంగా దీర్ఘకాల సంపద సృష్టికి వీలుండేలా ఈ వాటాలను బహుమతిగా ఇవ్వనున్నట్టు వివరించారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు సంస్థపై నమ్మకం పెరుగుతుందని, వారు తమతోనే కలసి ప్రయాణిస్తారని ఆయన తెలిపారు. కాగా, ఉద్యోగులకు ఇవ్వదలచిన వాటాలు, మొత్తం ఈక్విటీలో 1.6 శాతానికి సమానం. తమ సంస్థల చైర్మన్ అనిల్ అంబానీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.