: పండగ సీజనులో మీకు ఎంతో ఉపయోగపడే యాప్స్ ఇవే!
దసరా నుంచి దీపావళి వరకూ... ఇండియాలో పండగ సీజన్. ఎంతో షాపింగ్, మరెంతో ఆనందం. ప్రయాణాలు చేసే వేళ. ఈ సీజనులో ఏది కావాలన్నా అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని మునివేళ్లతో ఇంటికే తెప్పించుకునే సదుపాయం స్మార్ట్ ఫోన్ల ద్వారా దగ్గరైంది. ఈ నేపథ్యంలో మీకు ఉపయోగపడే యాప్స్ ఇవి. ఫైనాన్షియల్ ప్లానింగ్ యాప్స్: పండగల వేళ కేవలం ఖర్చు పెట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్ అవసరాలకు సైతం కొంత పొదుపు చేసుకోవచ్చు. ఎంత డబ్బు చేతిలో ఉంది. ఎంత వరకూ ఖర్చు చేయవచ్చు. దేనిలో ఎంత ఆదా చేస్తే ఎంత మిగులుతుందన్న విషయాలను వెల్లడించేందుకు 'మనీ వ్యూ' వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఖర్చులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. నిత్యావసరాలు కొనుగోలు చేసే యాప్స్: ఇంటికి కావలసిన సరుకుల నుంచి కూరగాయల వరకూ ఆర్డర్ చేసి, గ్రాసరీ స్టోర్ లకు వెళ్లే శ్రమ లేకుండా ఆఫర్ ధరలతో అందిస్తున్న యాప్స్ చాలానే మార్కెట్లో ఉన్నాయి. పెప్పర్ టాప్, గూఫర్స్, నేచర్ బాస్కెట్, బన్యా వంటి యాప్స్ వాడి ఎంతో ప్రయాణ సమయాన్ని, పార్కింగ్ బాధలను తప్పించుకోవచ్చు. జర్నీ యాప్స్: సెలవుల్లో కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తే, ముందుగానే రైల్వే, బస్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలలో వేచి చూడాల్సిన అవసరం లేదు. ఐఆర్ సీటీసీ, వివిధ రాష్ట్రాల బస్ సర్వీసుల యాప్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు ఉబెర్, ఓలా, టాక్సీ ఫర్ ష్యూర్ వంటి యాప్స్ స్మార్ట్ ఫోన్లో ఉంటే అప్పటికప్పుడు వాటిని బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ ఆఫరింగ్ యాప్స్: ఏదైనా సినిమాకు వెళ్లో, లేకుంటే విహారానికి వెళ్లో ఇంట్లో వండుకోవడం ఎందుకులే అనుకుంటే, నిమిషాల్లో ఇంటికి నచ్చిన, నోరూరించే వంటకాలను డెలివరీ చేసేందుకు ఎన్నో యాప్స్ ఉన్నాయి. పాండా, ఫాసూస్, టినీ ఓల్, జొమాటో, పిజ్జా హట్ వంటి యాప్స్ ఆర్డర్ తీసుకున్న 20 నుంచి 30 నిమిషాల్లో అన్ని రకాల వెరైటీలనూ ఇంటికి పంపుతున్నాయి. నిత్యావసర సేవల యాప్స్: దీపావళి సందర్భంగా ఇంటికి లైటింగ్ పెట్టించాలనుకున్నా, దసరా సందర్భంగా రంగులు వేయించాలనుకున్నా అందుకోసం పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల కోసం ఎదురుచూడక్కర్లేదు. అర్బన్ క్లాప్, హెల్ప్ ఫర్ ష్యూర్, లోకల్ ఓయ్ వంటి యాప్స్ మీకు సేవలందించేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, దగ్గర్లో డాక్టర్ ఎక్కడున్నాడన్న విషయాన్ని, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు లైబ్రేట్, ప్రాక్టో, షీ టీమ్స్ వంటి యాప్స్ ఎంతో సౌకర్యంగా ఉంటాయి.