: 'ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం'... మాల్డోవా మాజీ ప్రధాని కుట్ర!
సుమారు రూ. 6,500 కోట్లకు పైగా విలువైన అవినీతి కుంభకోణం ప్రధాన సూత్రధారి మాల్డోవా మాజీ ప్రధానమంత్రి వ్లాడ్ ఫిలాత్ ను ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పదవిలో ఉన్న సమయంలో చేసిన కుట్రను 'ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం'గా అభివర్ణించిన యాంటీ కరప్షన్ ఏజన్సీ అధికారులు ఫిలాత్ ను పార్లమెంట్ ఆవరణలోనే అరెస్ట్ చేశారు. 2009 నుంచి 2013 వరకూ ప్రధానిగా ఫిలాత్ ఉన్న సమయంలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారని, ఏ ఖాతాల్లోనూ చూపకుండా బిలియన్ డాలర్లను వాడుకున్నారని చీఫ్ ప్రాసిక్యూటర్ గురిన్ తెలిపారు. ఇది మొత్తం దేశ జీడీపీలో 10 శాతానికి సమానమని వివరించారు. దీంతో కరెన్సీ విలువ గణనీయంగా పడిపోయిందని, ప్రజల్లో అభద్రత పెరిగి నిరసనలు మిన్నంటాయని తెలిపారు. కాగా, ఆ దేశ చట్టాల ప్రకారం ఎవరినైనా, ఏ ఆరోపణలు లేకుండా గరిష్ఠంగా 72 గంటల పాటు పోలీసులు అదుపులో ఉంచుకోవచ్చు. మరో రెండు రోజుల్లో ఫిలాత్ పై అభియోగాలు మోపనున్నట్టు తెలుస్తోంది.