: పాకిస్థాన్ లో భారత ఉగ్రచర్యలు: ఐరాసకు సాక్ష్యాలందించిన పాక్
పాకిస్థాన్ లో జరుగుతున్న ఉగ్రవాద చర్యల వెనుక భారత్ హస్తముందని, ఆ దేశం అందిస్తున్న సహాయ, సహకారాలతోనే తమ భూభాగంలో ప్రజా వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ దేశం ఐక్యరాజ్య సమితికి సాక్ష్యాలను అందించింది. కరాచీ, బెలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ వర్గానికి ఇండియా నుంచి నిధులు అందుతున్నాయని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లా మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించిన మూడు ఫైళ్లను ఐరాస కార్యదర్శికి అందించినట్టు పేర్కొన్నారు. పాక్ ను అస్థిర పరిచే కుట్ర భారత భూభాగంపై జరుగుతోందని, ప్రత్యక్షంగా తలపడలేక పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించింది. ప్రపంచ దేశాలను తప్పుపట్టించేలా, పాక్ గురించి తప్పుడు ఆరోపణలను భారత్ గుప్పిస్తోందని ఆయన విమర్శించారు. ఇటీవల ఆ దేశంలో ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయాయని, ప్రభుత్వమే వీటిని చేయిస్తున్నదని ఆయన నిప్పులు చెరిగారు.