: షేమ్ ముంబై... చిన్నారికి చికిత్స కోసం పాక్ కుటుంబం వస్తే కనీసం హోటల్ రూం కూడా ఇవ్వలేదు!


శత్రువైనా మానవత్వం చూపడంలో భారతీయులు ముందుంటారని నిరూపించే ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. కానీ ఈ దఫా మాత్రం పరిస్థితులు మారాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. తమ బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స నిమిత్తం ముంబై వచ్చిన ఓ పాకిస్థాన్ కుటుంబానికి రూమిచ్చేందుకు ఒక్క హోటల్ కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ కుటుంబం గత రాత్రి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గడపాల్సి వచ్చింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఈ బృందంలో ఉండగా, వీరు పాకిస్థాన్ జాతీయులని, హోటల్ లో ఉంచితే ఇబ్బందులు తలెత్తవచ్చని చెబుతూ ఎవరూ రూం ఇవ్వలేదని తెలుస్తోంది. "మీరంతా పాకిస్థానీలు. మీకు రూములను ఇచ్చేందుకు అనుమతి లేదు. మా వద్ద 'ఫారమ్ సీ' కూడా లేదు. దాన్ని పోలీసు స్టేషన్ నుంచి మీరే తెచ్చుకోండి" అని చెప్పినట్టు ఆ కుటుంబ పెద్ద ఇనాయత్ అలీ వెల్లడించారు. చెల్లుబాటులో ఉన్న వీసా చూపినప్పటికీ, వారు అంగీకరించలేదని వాపోయారు. గత కొంత కాలంగా మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలో జరుగుతున్న పాక్ వ్యతిరేక కార్యకలాపాల కారణంగానే వీరికి రూములిచ్చేందుకు హోటల్ నిర్వాహకులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. తొలుత వీరు రైల్వే స్టేషన్ లో ఉండేందుకు సైతం ఆర్పీఎఫ్ సిబ్బంది నిరాకరించారట. ఆపై మీడియా కల్పించుకోవడంతో తామిక్కడ గడిపేందుకు అనుమతించారని ఇనాయత్ వివరించారు. కాగా, ఏ విదేశీయుడికైనా ఆతిథ్యం ఇవ్వాలంటే, హోటల్ నిర్వాహకులు 'ఫారమ్ సీ' నింపి, వారు చెకిన్ అయిన 24 గంటల్లోగా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపాల్సి వుంటుంది. ముంబై హోటళ్ల తీరుపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News