: భారత ప్రభుత్వానికి షాక్... చాపర్ల డీల్ రద్దు చేసుకున్న ఈక్వెడార్
ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థకు పెద్ద షాకిస్తూ, గతంలో తాము ఆర్డర్ చేసుకున్న ధ్రువ్ అడ్వాన్డ్స్ లైట్ హెలికాప్టర్ల డీల్ ను రద్దు చేసుకుంటున్నట్టు ఈక్వెడార్ ప్రకటించింది. గతంలో ఈక్వెడార్, భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరగా, 2009 నుంచి 2012 మధ్య ఏడు చాపర్లను ఇండియా సరఫరా చేసింది. వీటిల్లో నాలుగు కూలిపోయాయి. ఈ కారణం చేతనే ధ్రువ్ హెలికాప్టర్లు తమకు వద్దని ఈక్వెడార్ నిర్ణయించుకుంది. ఈ నాలుగు ప్రమాదాల్లో ఒక ప్రమాదంలో దేశ అధ్యక్షుడు మరణించి వుండాల్సింది. ఆయన ప్రయాణం చివరి నిమిషంలో రద్దు కావడంతో, వెనక్కు బయలుదేరిన చాపర్ కాసేపటికే ఇంజన్ లోపాలతో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లలో తయారీ లోపాలున్నాయని ఈక్వెడార్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో తమకింకా సమాచారం అందలేదని హెచ్ఏఎల్ అధికారులు వివరించారు. కాగా, ఉత్తరాఖండ్ లో వరదలు సంభవించిన వేళ ధ్రువ్ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో విరివిగా పాల్గొని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన సంగతి తెలిసిందే.