: జగన్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు: ఉపముఖ్యమంత్రి కేఈ
వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిపక్వత లేదని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపై జగన్ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే వస్తామని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంకేతాలు పంపారని, మన ప్రతిపక్షనేత మాత్రం ఈవిధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జగన్ శైలి చిన్నపిల్లల వ్యవహారం మాదిరిగా ఉందంటూ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, అది అయ్యే పని కాదని అన్నారు. కాగా, ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు, విదేశీ ప్రముఖులు రాజధాని శంకుస్థాపనకు వస్తుండడం శుభసూచకమని కృష్ణమూర్తి అన్నారు.