: అమరావతి శంకుస్థాపనకు 2 లక్షల మంది వచ్చే అవకాశం


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలంటూ ప్రముఖులకు, రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది. ముఖ్యంగా మూడు విధాలుగా ఆహ్వానాలను పంపిస్తోంది. పత్రికలు, ఈ-మెయిల్స్, ఫోన్ల ద్వారా వారికి ఆహ్వానాలు అందుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి వేర్వేరు చోట్ల బసలు ఏర్పాటు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వంటి ప్రాంతాల్లో బస ఏర్పాటు చేస్తున్నట్లు ఆహ్వాన కమిటీకి చైర్మన్ గా ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ఆహ్వానాలను పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని తెలిపిన ప్రముఖులకు పాస్ లు, రోడ్ మ్యాప్ లు కూడా పంపుతున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు ఇరవై వేల ఈ- మెయిల్స్ ద్వారా ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో పాటు కొంతమంది ఎన్ ఆర్ఐలకు కూడా ఈ-మెయిల్స్ పంపామన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు మొదలైన వారందరికీ కలిపి సుమారు లక్ష వరకు ఆహ్వానాలు పంపామన్నారు. ముఖ్యంగా అమరావతిలో భూములిచ్చిన రైతులను కూడా ఆహ్వానించామని కలెక్టర్ చెప్పారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలు సహా రెండు లక్షలమంది వచ్చే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News