: వాటిని చదివితే మోదీ కూడా సిగ్గుపడతారు: అఖిలేష్ యాదవ్ ధ్వజం


సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్లలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ, అనునిత్యం అందరితో అనుసంధానమవడంలో ప్రధాని మోదీని మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాను తెలియజేయాలనుకునే అంశాలను, పంచుకోవాలనుకున్న భావాలను ఎప్పటికప్పుడు సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఆయన పంచుకుంటుంటారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ మండిపడ్డారు. ఫేస్ బుక్ లో తక్కువ మాట్లాడాలని, క్షేత్రస్థాయిలో ఎక్కువ పనిచేయాలని ఎద్దేవా చేశారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మోదీ తనకు ఎదురుగా వస్తే ఇదే విషయాన్ని ఆయనకు చెబుతానని అఖిలేష్ చెప్పారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని... ఇతర విషయాలపై వారు దృష్టి సారించకుండా చూడాలని కోరారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే, దాద్రి ఘటన జరిగిందని చెప్పారు. వ్యక్తిగతంగా బీఫ్ తినడాన్ని తాను కూడా వ్యతిరేకిస్తానని... అయినా, ఎవరికి ఇష్టమైన ఆహారాన్ని వారు తింటారని, ఈ విషయంలో చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోరాదని అఖిలేష్ సూచించారు. దాద్రి ఘటన తర్వాత ప్రపంచ మీడియా రాసిన కథనాలను చదివితే, మోదీ కూడా సిగ్గుపడతారని అన్నారు.

  • Loading...

More Telugu News