: అమెరికా అధ్యక్షుడికి దక్కే అతిపెద్ద ప్రతిఫలం ఏమని అడిగితే, ఒబామా చెప్పిన సమాధానం ఇదే!
అమెరికా అధ్యక్షుడు... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. ప్రస్తుతం ఆ పదవిలో బరాక్ ఒబామా కొనసాగుతున్నారు. ఓ అమెరికా అధ్యక్షుడికి దక్కే అతిపెద్ద ప్రతిఫలం ఏంటి? ఈ ప్రశ్నను ఒబామాకు పరిచయమున్న ప్రజలు చాలాసార్లు అడిగారట. దీనికి ఆయనిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? "కొన్నిసార్లు ప్రజలు మీకు దక్కిన అతిపెద్ద ప్రతిఫలం ఏంటని ప్రశ్నిస్తారు. దీనికి తొలి సమాధానం 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానం. ఆ తరువాత నన్ను ఆనందింపజేయడానికి గిటార్ తీసుకుని వైట్ హౌస్ కు వచ్చే 'బుడ్డీ గై'. మిగతావన్నీ ఈ రెండింటి ముందు కొరగావు" అని ఆయన అన్నారు. అమెరికన్ల క్రియేటివిటీపై విజయోత్సాహాలు జరుపుకుంటూ వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. స్మోకీ రాబిన్ సన్, బుడ్డీ గై, క్వీన్ లతీఫా, ఉషెర్, కెబ్ మో... అంటూ తనకు నచ్చిన వారి పేర్లనూ చెప్పారు. వీరంతా ఎంతో క్రియేటివిటీ ఉన్నవారని, అమెరికన్ల జీవన విధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు కృషి చేసిన వారు మరెందరో ఉన్నారని ఆయన అన్నారు.