: కర్నూలులో ఎడ్ల బండ్ల బారులు... నేడే బైరెడ్డి బతుకుదెరువు యాత్ర
కర్నూలు నగరం నేడు ఎడ్ల బండ్ల బారులతో హోరెత్తనుంది. నగరం నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ నుంచి నగరం ఓ చివర వరకు ఎడ్ల బండ్లు బారులు తీరనున్నాయి. ఎందుకంటే, రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎడ్ల బండ్లతో వినూత్న నిరసనను చేపట్టనున్నారు. బతుకుదెరువు యాత్ర పేరిట ఆయన చేపడుతున్న యాత్రలో జిల్లాలోని పూడిచెర్ల గ్రామం నుంచి కర్నూలు దాకా ఎడ్ల బండ్లతో రైతులు కదం తొక్కనున్నారు. సారవంతమైన భూములను పరిశ్రమల స్థాపనకు అప్పగించడాన్ని నిరసిస్తూ బైరెడ్డి చేపడుతున్న యాత్రకు దాదాపు అన్ని విపక్షాలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో పూడిచెర్ల నుంచి కర్నూలుకు వందలాది ఎడ్ల బండ్లపై రైతులు కదలిరానున్నారు.