: ఆహ్వానిస్తే... తప్పకుండా వెళతాం: అమరావతి శంకుస్థాపనపై టీ మంత్రి కేటీఆర్
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆహ్వానం అందితే తప్పనిసరిగా అమరావతి శంకుస్థాపనకు హాజరవుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరవ్వడమే కాక ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు కూడా తెలుపుతామని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న తెరాస భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన అమరావతి ఆహ్వానాన్ని ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఏపీలు రెండు సమాంతరంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం చిక్కిందన్నారు. అభివృద్ధిలో పోటీ పడదామని, కుట్రలతో కాదని కూడా ఆయన ఏపీకి పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాలి. ఈ విషయంలో మనకు అంబానీ సోదరులే ఆదర్శం కావాలి. వారిద్దరూ విడిపోయిన తర్వాత వ్యాపారాన్ని ఎంతగానో విస్తరించారు. ఇద్దరి ఆస్తి కలిపితే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వారే అవుతారు’’ అని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.