: పోరాడి పరువు నిలిపిన మిస్టర్ కూల్!


మిస్టర్ కూల్, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే పోటీలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ధోనీ 92 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాణించగా, రహానే 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 3, మోర్కెల్, తాహిర్ లు చెరో రెండు, రబడా ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 3 పరుగులకే ఓపెనర్ రోహిత్ శర్మ పెవీలియన్ దారి పట్టగా, 50 పరుగుల తరువాత మోర్కెల్ బౌలింగ్ లో ధావన్ ఔట్ అయ్యాడు. కాసేపటి తరువాత విరాట్ కోహ్లీ 12 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఆపై ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో రైనా డకౌట్ కాగా, ధోనీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. చివర్లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీకి సహకారాన్ని అందిస్తూ, 22 బంతుల్లో 22 పరుగులు చేసి స్టెయిన్ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. చివర్లో మోహిత్ ను అడ్డు పెట్టుకుని మూడు ఓవర్లకు పైగా ఆడిన ధోనీ, పలుమార్లు సింగిల్స్ తీసేందుకు అవకాశం లభించినా తీయకుండా స్ట్రయిక్ ను కాపాడుకుంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ధోనీ తీరుతో చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. మరికాసేపట్లో 248 పరుగుల విజయలక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News