: లోకల్ రైలులో బిడ్డ ప్రసవం .. ఒక జర్నలిస్టు సేవాగుణం
ముంబయి లోకల్ రైలు ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతరద్దీగా ఉన్న రైలులో నెలలునిండిన సుదేవి, ఆమె భర్త రామ్ లాల్ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కే ప్రయాణికులు...దిగే ప్రయాణికులు తోసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో, నిండు గర్భిణీ ప్రసవవేదన పడుతున్న అరుపులు ఆ కంపార్టుమెంట్ లో విన్పించాయి. అయినా, ప్రయాణికులెవ్వరూ పట్టించుకోలేదు. పైగా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. పక్కబోగీలోకి ఉన్నపళంగా జనాలు వెళ్తుండటం చూసి అక్కడే ఉన్న జర్నలిస్టు ఇక్బాల్ అన్సారీకి అనుమానం వచ్చింది. వెళ్లి చూశాడు. చేతిలో పండంటి బిడ్డతో రామ్ లాల్... ఆ కంపార్టుమెంట్ లో ఓ మూల కూర్చున్న సుదేవి... అంతే, ఇక్బాల్ చలించిపోయాడు. వెంటనే రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. అది కలవక పోవడంతో మరో నంబర్ కు ఫోన్ చేశాడు. వారు స్పందించడంతో జరిగిన విషయమంతా చెప్పారు. ఇక్బాల్ చైన్ లాగడంతో కంజుర్ మార్గ్ స్టేషన్ వద్ద రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది స్ట్రెచర్ తో అక్కడ సిద్ధంగా ఉన్నారు. సుదేవిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ కు ఆ దంపతులు కృతఙ్ఞతలు తెలిపారు.