: ఈ-కామర్స్ కంపెనీల 'స్మార్ట్' మోసం... భారీ డిస్కంట్లు పాత మోడల్స్ పైనే!


ఈ పండగ సీజనులో అమ్మకాలు పెంచుకుని, లాభాలను మూటగట్టుకోవాలని భావిస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ యాప్ ల మాధ్యమంగా కస్టమర్లను మోసం చేస్తున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. 80 శాతం వరకూ భారీ డిస్కౌంట్లని, అంతకుమించిన క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షించిన కంపెనీలు, కేవలం పాతవి, అమ్ముడు పోకుండా మిగిలిన ఉత్పత్తులపైనే ఆఫర్లు అందిస్తున్నాయని వెల్లడించారు. మైక్రోమ్యాక్స్, ఒనీడా, బీపీఎల్, మోటరోలా వంటి కంపెనీల పాత మోడల్స్ కు చెందిన గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లను వదిలించుకునేందుకు ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ప్రారంభించిన అమ్మకాల్లో కంటికి ఆకర్షణీయంగా ప్రకటనలు మాత్రమే కనిపిస్తున్నాయని, లోతుగా వెళితే, పెద్దగా ప్రయోజనాలేమీ లేకుండా పోయిందని వివరించారు. ఒక్క స్మార్ట్ ఫోన్ల విషయంలోనే కాదు. అప్పెరల్స్, యాక్సెసరీస్ విషయంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. గత సంవత్సరం తాజా ఐఫోన్లు, సాంసంగ్ గెలాక్సీ ఫోన్లు, సోనీ టీవీలను మంచి డిస్కౌంట్ ధరలకు అందించిన ఇవే కంపెనీలు ఈ దఫా చౌక బ్రాండ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. "మా సరికొత్త దుస్తుల రకాలకు డిస్కౌంట్లను ఇవ్వడం లేదు. గత సీజనులో మిగిలిపోయిన స్టాక్స్ మాత్రమే ఆఫర్లలో విక్రయిస్తున్నాం" అని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జే సురేష్ వ్యాఖ్యానించడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ సీజనులో మార్జిన్లు, లాభాలపైనే దృష్టిని సారించామని ఆయన స్పష్టం చేశారు. 2014లో 60 నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటించిన ఓ ప్రముఖ షూ బ్రాండ్, ఈ సంవత్సరం అసలు రంగంలోకే దిగలేదు. ఇక హెయిర్ ఇండియా సైతం ఈ యేడు భారీ ధరల తగ్గింపు ఇవ్వలేమని వెల్లడించింది. ఈ-కామర్స్ సంస్థలతో ధరల ఒప్పందాలను కుదుర్చుకున్న సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా వెల్లడించారు. మరో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ పానాసోనిక్ సైతం ఇదే విషయాన్ని తెలిపింది. ఈ సీజనులో తమ మార్జిన్లు తగ్గించుకుని మరీ అమ్మకాలపై దృష్టిని పెట్టాలని భావించడం లేదని సంస్థ భారత ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News