: రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లకు కమిటీల నియామకం
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకు కమిటీలు ఖరారయ్యాయి. ఏర్పాట్లపై ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ విజయవాడలో ఇవాళ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్షలో మంత్రుల పేర్లను కమిటీల్లో చేర్చారు. స్వాగత కమిటీలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ లు, ఆతిథ్య కమిటీలో మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత, రాష్ట్రస్థాయి ఉత్సవాల కమిటీలో మంత్రులు మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు సభ్యులుగా ఉంటారు. మీడియా కమిటీలో సభ్యులుగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాజధాని వేదిక కమిటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు చేర్చారు. నిర్వహణ కమిటీ సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆహ్వాన కమిటీ సభ్యులుగా అయ్యన్న పాత్రుడు, కామినేనిలను నియమించారు. ప్రతి కమిటీలో సీఆర్ డీఏ, మున్సిపల్ ప్రొటోకాల్ అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు చోటు కల్పించారు.