: అమరావతి శంకుస్థాపనకు గ్రీన్ సిగ్నల్...అనుమతులన్నీ ఇచ్చేసిన పర్యావరణశాఖ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయాయి. నిన్నటిదాకా పర్యావరణ శాఖ నుంచి అనుమతి లేకుండానే పనులు ఎలా మొదలుపెడతారని కొంతమంది విమర్శించారు. అంతేకాక గ్రీన్ కారిడార్ కు సంబంధించి ఓ వ్యక్తి ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ కూడా వేశారు. దీనిపై స్పందించిన ట్రైబ్యునల్ అమరావతి పరిధిలో భూమి చదును పనులను నిలిపేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన ఏపీ ప్రభుత్వం, సమాధానాన్ని ఇచ్చే పనినీ ప్రారంభించింది. తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా ఊపింది. అమరావతికి తమ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల ప్రక్రియ మొత్తం పూర్తైందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రకటించారు. ప్రధానిని కలిసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే జవదేకర్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.