: మెదక్ జిల్లా కంది జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి యాదగిరి అనే జీవిత ఖైదీ పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా బయటికి తెలిసింది. ప్రతిరోజులానే పోలీసు పహారాలో అతడు గార్డెనింగ్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకున్నాడు. అయితే యాదగిరి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. వెంటనే జైలు ప్రాంగణమంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జైలు అధికారులను వివరణ కోరారు. 10 మంది మహిళల హత్య కేసులో యాదగిరి జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతని కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకులాడుతున్నాయి. అయితే హత్య కేసులో కొంతకాలం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడని, ఈ ఏడాది జులైలో కంది జైలుకు తరలించారని తెలిసింది. మరో రెండు నెలల్లో అతని శిక్షా కాలం పూర్తికానుందట. అతని స్వస్థలం తూప్రాన్ మండలంలోని గుండ్రేటి పల్లి.