: దాద్రిపై ఎట్టకేలకు నోరు విప్పిన మోదీ...ఇలాంటి వాటికి బీజేపీ మద్దతివ్వబోదని వ్యాఖ్య
దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు నోరు విప్పారు. దాద్రి తరహా ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆయన ఈ తరహా ఘటనలకు బీజేపీ మద్దతివ్వబోదని తేల్చిచెప్పారు. గోమాంసం వండారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తిపై కొందరు హిందువులు దాడి చేశారు. ఈ ఘటనలో అఖ్లాఖ్ చనిపోగా, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్పందించేందుకు తొలుత కేంద్ర మంత్రులు వెనకడుగు వేసినా, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. అయితే మోదీ మాత్రం నిన్నటిదాకా దీనిపై నోరు విప్పలేదు. దీంతో విపక్షాలన్ని మోదీపై విమర్శలు గుప్పించాయి. బెంగాల్ కు చెందిన ఓ పత్రికతో మాట్లాడిన సందర్భంగా మోదీ దాద్రి ఘటనను ఖండించారు. ‘‘దాద్రి లాంటి ఘటన నిజంగా విచారకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేంటి? ఇలాంటి ఘటనలకు బీజేపీ మద్దతివ్వబోదు. ఈ తరహా ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బీజేపీ విరుద్ధం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.