: తేడా వస్తే మన యువతులు 'అపర కాళిక'లే... ఆసక్తి కలిగిస్తున్న థామ్సన్ రాయిటర్స్ అధ్యయనం


ఇండియాలో యువతులు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునేవారి పట్ల లింగ భేదం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, వేధింపులు ఎదురైతే చూస్తూ బాధను దిగమింగే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. పనిచేస్తున్న చోట హెరాస్ మెంట్ ఎదురైతే, దాని గురించి పక్కవారితో చెప్పడం, ఫిర్యాదు చేయడం, అవసరమైతే నాలుగు వాయించడంలో జీ-20 (అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య) దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలు ముందు నిలిచారు. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్, ది రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ సంయుక్తంగా 9,500 మంది మహిళలను భాగం చేస్తూ నిర్వహించిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాల ప్రకారం, ఇండియాలో ప్రతి నలుగురిలో ఒక మహిళా ఉద్యోగిని తమకు సమాన అవకాశాలు లభించడం లేదని భావిస్తున్నారు. ఒకవైపు గృహిణిగా జీవితం, మరోవైపు ఉద్యోగ సవాళ్లు తమను ఇబ్బంది పెడుతున్న అతి పెద్ద సమస్యని 57 శాతం మంది వెల్లడించగా, 27 శాతం మంది తాము పనిచేస్తున్న చోట లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. జీ-20 దేశాలన్నింటిలో ఇదే అతి తక్కువ శాతం కావడం గమనార్హం. ఇక వేధింపులు ఎదుర్కొన్న వారిలో 53 శాతం మంది దాని గురించి ఇతరులకు చెప్పడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇవ్వడం వంటివి చేశారు. ఇది జీ-20లో అత్యధికం. ఈ అధ్యయనం ప్రకారం, ఇండియాలో పురుషులతో సమానంగా పనిచేసే వారికి సమాన వేతనం లభిస్తోందని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక వేధింపులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో టర్కీ, ఇండియా, మెక్సికో, అర్జంటీనా దేశాలుండగా, సౌత్ కొరియా, రష్యా, జర్మనీ, బ్రిటన్ దేశాల్లో ఈ సమస్య అతి తక్కువగా ఉంది. వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్న వారిలో ఇండియా తరువాత యూఎస్, కెనడా, మెక్సికో దేశాలుండగా, బ్రెజిల్, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా దేశాల్లో వేధింపులను భరిస్తూ, దాని గురించి చెబితే ఉద్యోగం పోతుందని అత్యధికులు భయపడుతున్నారు. ఇండియాలో 2012లో నిర్భయ అత్యాచారం తరువాత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, యువతులు తమకు ఎదురయ్యే అవమానాలను భరించే స్థితిలో లేరని ఈ సందర్భంగా రాయిటర్స్ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News