: అమరావతి శంకుస్థాపనపై నీలినీడలు... సజావుగా జరిగేనా?!
కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు పొందే వరకూ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని, అసలు భూమిని చదును కూడా చేయరాదని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగానికి అమరావతి శంకుస్థాపన విషయమై భయాందోళనలు కలిగిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు వచ్చేశాయంటూ అధికారులు చెబుతున్నప్పటికీ, వాటిని ఇప్పటి వరకూ బయటపెట్టక పోవడం మరో పది రోజుల్లో శంకుస్థాపన ఉండటంతో, ఈ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. స్వయంగా హరిత ట్రైబ్యునల్ తప్పు పట్టిన కార్యక్రమానికి ప్రధాని వస్తారా? అన్న ప్రశ్న సైతం ఉదయిస్తోంది. అసలు హరిత ట్రైబ్యునల్ ఏం చెప్పిందంటే... విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ అనే వ్యక్తి రాజధాని నిర్మాణం విషయంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని, అనుమతులు రాకుండానే పనులు మొదలు పెట్టారని హరిత ట్రైబ్యునల్ ను సాక్ష్యాధారాలతో సహా ఆశ్రయించగా, జస్టిస్ యూడీ సాల్వి, జస్టిస్ రంజన్ చటర్జీలతో కూడిన ధర్మాసనం శనివారం నాడు, సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున విచారణకు హాజరైన న్యాయవాది సమాధానమిస్తూ, అమరావతి ప్రాంతంలో తడి భూముల వివరాలను ఇంకా గుర్తించలేదని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కృష్ణా నదికి వరద వస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముంపునకు గురయ్యే ప్రాంతాలను నిర్మాణం నుంచి మినహాయించామని వివరించారు. పర్యావరణ అనుమతులు రాకముందే అమరావతి నిర్మాణానికి కేటాయించిన స్థలంలో బుల్ డోజర్లతో నేలను చదును చేస్తున్నారని చెబుతూ, ఉద్దండరాయునిపాలెంలో సెప్టెంబర్ 14న తీసినట్టుగా ఉన్న కొన్ని ఫోటోలను పిటిషన్ దారు చూపారు. అదనపు సాక్ష్యంగా, కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు కరెంటును సరఫరా చేస్తున్న తీగలను తొలగించాల్సిందిగా విజయవాడ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని కోర్టుకు అందించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఈ సాక్ష్యాలు నిజమైతే, పర్యావరణాన్ని కాపాడేందుకు తాము రంగంలోకి దిగుతామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఏపీ సర్కారు గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా నడుస్తోందని భావిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల నియంత్రణ చట్టం 2006 ప్రకారం అనుమతులు రాకుండా నిర్మాణాలు చేపట్టడం గానీ, భూమిని సిద్ధం చేయడం గానీ చేయకూడదని, అక్కడ ఎటువంటి కార్యక్రమాలూ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు తెలిపింది. పిటిషన్ దారు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు రెండు వారాల గడువిస్తూ, అదనపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. కాగా, ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయాలని, స్వయంగా హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని, ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని ప్రధానికి పూర్తి వివరాలతో లేఖ రాయనున్నట్టు శ్రీమన్నారాయణ తెలిపారు. ఇదిలావుండగా, అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వెళ్లాలా? వద్దా? అన్న విషయమై ప్రధాని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.