: తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ...యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం: స్పీకర్ కోడెల


ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ నెలలో జరగనున్నాయి. ఈ సమావేశాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసమే కాక రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా జరిగే అన్ని సమావేశాల నిర్వహణను కూడా అక్కడే నిర్వహించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయించారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జగరనున్న ప్రదేశానికి సమీపంలో ఐదెకరాల్లో శాసనసభ, శాసనమండలి సమావేశాలకు సరిపడేలా తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ఆయన నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శీతాకాల సమావేశాల్లోగానే సదరు భవనాన్ని సిద్ధం చేయాలని నిన్న జరిగిన సమీక్షలో భాగంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేయాలని, తక్షణమే టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. ఇప్పటికే భవన నిర్మాణానికి సంబంధించి రూపొందిన బ్లూ ప్రింట్ కు కొన్ని మెరుగులు దిద్దిన ఆయన సీఎం నారా చంద్రబాబునాయుడి అనుమతి తీసుకుని తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాల్సి ఉన్నా, తాత్కాలిక భవనమేనన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దుబారాను తగ్గించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News