: ఐదు నిమిషాల సమయం ప్లీజ్..: ప్రధానికి చిరంజీవి, కేవీపీ లేఖ
అమరావతి నగర శంకుస్థాపన పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీలు ఓ ప్రత్యేక లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలియజేసేందుకు వీలుగా తమకు ఐదు నిమిషాల పాటు అపాయింటుమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రాంచంద్రరావులు లేఖ రాశారు. వీరితో పాటు సుబ్బరామిరెడ్డి, జైరాం రమేశ్ తదితరులు సైతం ఈ లేఖపై సంతకాలు చేశారని జేడీ శీలం మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రభుత్వం చేసిన తీర్మానం అమలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఆర్థిక వృద్ధిలో పయనించే అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. గతంలో తిరుపతి, విశాఖపట్నం పర్యటన సందర్భంగా గతంలో ప్రధాని చేసిన హామీలను గుర్తు చేసిన ఆయన, శంకుస్థాపన సమయంలో ప్రత్యేక హోదాపై, ప్యాకేజీపై మోదీ ప్రకటన చేస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.