: టీఆర్ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యం...ఇరిగేషన్ ఇంజినీర్ ను గల్లా పట్టి, గోడకేసి కొట్టారట!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులపై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అధికారులపై దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వయంగా ఇరిగేషన్ ఇంజినీర్ ను కొట్టారు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సాగునీటి పారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) వీరేందర్ ను ఇంటికి పిలిపించి బూతు పురాణం అందుకున్నారట. అంతటితో ఆగని చిన్నయ్య ఇంజినీర్ కాలర్ పట్టుకుని లాగి చెంపమీద కొట్టడంతో పాటు గోడకేసి కొట్టారట. వివరాల్లోకెళితే... జిల్లాలోని నెన్నెల మండలంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను వీరేందర్ పర్యవేక్షిస్తున్నారు. బిల్లుల మంజూరులో వీరేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. ఈ క్రమంలో ఎమ్మెల్యే పీఏ భీమా గౌడ్ నిన్న వీరేందర్ కు ఫోన్ చేసి ‘సార్ రమ్మంటున్నారు’ అని చెప్పారట. ఇదే విషయాన్ని వీరేందర్ తన పై అధికారులకు చెబితే, ‘‘పో... అక్కడ నీకు అసలు విషయం తెలుస్తుంది’’ అని పరోక్షంగా ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్న విషయాన్ని చెప్పారట. చేసేదేమీ లేక మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటికి వీరేందర్ వెళ్లారు. తన ఇంటి లోపలికి అడుగు పెట్టీ పెట్టకముందే వీరేందర్ పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారట. బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని నిలదీస్తూనే చొక్కా పట్టుకుని లాగి చెంపమీద కొట్టారు. అంతేకాక వీరేందర్ ను గోడకేసి మరీ కొట్టారట. ఎందుకు కొడుతున్నారని అడిగిన వీరేందర్ పై ఎమ్మెల్యే బూతు పురాటం అందుకున్నారట. దీనిపై తన పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వీరేందర్ ఆ తర్వాత లోకల్ మీడియా ముందు వాపోయారు. ఈ ఘటనపై ఇంజినీర్ల అసోసియేషన్ ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.