: ఊగిసలాట మధ్య స్టాక్ మార్కెట్ కు స్వల్ప నష్టం, 3.5 శాతం నష్టపోయిన ఓఎన్జీసీ


స్వల్ప వ్యవధిలో భారత స్టాక్ మార్కెట్ రెండు నెలల గరిష్ఠానికి చేరిన తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడంతో ఊగిసలాట మధ్య సాగిన సెషన్ నష్టాలను నమోదు చేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో సైతం ఇదే ట్రెండ్ కనిపించింది. సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచికలు నెమ్మదిగా కిందకు జారిపోయింది. పలుమార్లు లాభనష్టాల మధ్య ఒడిదుడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్, నిఫ్టీలు చివరికి నష్టం వైపు నిలిచాయి. మంగళవారం సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 57.58 పాయింట్లు పడిపోయి 0.21 శాతం నష్టంతో 26,846.53 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 11.90 పాయింట్లు పడిపోయి 0.15 శాతం నష్టంతో 8,131.70 పాయింట్ల వద్దకు చేరాయి. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్జీసీ ఈక్విటీ విలువ 3.55 శాతం నష్టపోయింది. ఈ సంస్థకు చెందిన సహజవాయు నిల్వలు రిలయన్స్ రిజర్వాయర్ లోకి వచ్చేశాయని వెల్లడైన డీఅండ్ఎం నివేదిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపిందని నిపుణులు అంచనా వేశారు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 98,85,739 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.02 శాతం, స్మాల్ క్యాప్ 41 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రా టెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, బీపీసీఎల్, యస్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు లాభపడగా, ఐడియా, ఓఎన్జీసీ, హిందాల్కో, వీఈడీఎల్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News