: ఫ్లిప్ కార్ట్ నుంచి పది గంటల్లో 10 లక్షల ప్రొడక్టులు కొనేశారు!
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన 'ది బిగ్ బిలియన్ డేస్'కు ఆరంభంలో అవాంతరాలు ఎదురై సర్వర్లు జామ్ అయినా, ఆపై సమస్య సద్దుమణిగింది. ఆఫర్ ప్రారంభమై ఇప్పటివరకూ 16 గంటలు గడువగా, తెల్లవారుజాము నుంచి 10 గంటల వ్యవధిలో 10 లక్షల ప్రొడక్టులను విక్రయించామని సంస్థ తెలిపింది. ప్రతి సెకనుకు 25 వస్తువులను అమ్మామని, మొత్తం 60 లక్షల మంది వెబ్ సైట్, యాప్ లను సందర్శించారని ఫ్లిప్ కార్ట్ కామర్స్ ప్లాట్ ఫాం హెడ్ ముఖేష్ బన్సాల్ ఈ సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజుల్లో 16 లక్షల మంది తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, మొత్తం ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండే ఆఫర్లను వాడుకుని కోటి ప్రొడక్టులకు పైగా కొనుగోళ్లు సాగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, లూధియానా, లక్నో, భోపాల్ నగరాల నుంచి అధిక ఆర్డర్లు వచ్చాయని, పురుషుల దుస్తులు, యాక్సెసరీస్ అధికంగా అమ్ముడయ్యాయని ఆయన వివరించారు.