: గర్ల్ ఫ్రెండ్స్ మాయలో పడి కటకటాల వెనక్కి
గర్ల్ ఫ్రెండ్స్ తో జల్సాలు చేసేందుకు ముగ్గురు యువకులు పక్కదారి పట్టారు. గొలుసు దొంగతనాలు, బైక్ లు ఎత్తుకుపోవడం వంటి నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో సరదాలు చేసుకునేవారు. అయితే, వారి ఆటలు ఎంతోకాలం సాగలేదు. చివరకు పోలీసులకు పట్టుబడి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు. కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ సోమవారం హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్ రాజు స్నేహితులు. ఈ ముగ్గురికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రావణ్, రాము పెద్దపల్లిలోను, సునీల్ రాజ్ కరీంనగర్ లోని గణేశ్ నగర్ లో నివసిస్తున్నారు. చిన్నచిన్న పనులు చేసి ఈ ముగ్గురు డబ్బులు సంపాదించుకునేవారు. అయితే, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి సరదా చేయడానికి ఈ డబ్బులు చాలకపోవడంతో చోరీలు మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని గొలుసులు లాక్కుని పారిపోయేవారు. కరీంనగర్ కు వచ్చి రాత్రి సమయాల్లో నంబర్ లేని బైక్ లను చోరీ చేస్తుండేవారు. రెక్కీ నిర్వహించి గొలుసు దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఒక్కరు, ఇద్దరు కలిసి, ముగ్గురూ కలిసి దొంగతనాలు చేస్తుండేవారు. ఒక గ్యాంగ్ కాదు, రెండు లేదా మూడు గ్యాంగ్ లు ఈ దొంగతనాలు చేస్తున్నాయన్న భ్రమ కల్పించేవారు. దొంగతనం చేసిన తర్వాత ఆ బైక్ ను ఎక్కడన్నా వదిలేసేవారు లేదా అమ్మివేసేవారు. కరీంనగర్ జిల్లాతో పాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ ముగ్గురిపై ఇప్పటివరకు 30 కేసులు నమోదయ్యాయి. వీరిని పట్టుకునేందుకు గాను కరీంనగర్ టౌన్ లో 15 బృందాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం స్థానిక విద్యానగర్ లో గొలుసు దొంగతనం చేసి పారిపోతున్నవీరిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. అందులో ఒకరు పారిపోగా నిన్న ఆ యువకుడిని గణేశ్ నగర్ లో పట్టుకున్నారు. నిందితులను విచారించగా కరీంనగర్ లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్ స్నాచింగ్ లు, 6 బైక్ లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్ లు, వన్ టౌన్ పరిధిలో 1 గొలుసు దొంగతనం మరికొన్ని చోట్ల దొంగతనాలకు తాము పాల్పడినట్లు ఆ యువకులు తెలిపారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు.