: 'సాహిత్య అకాడమీ'ల తరువాత... ఇక 'పద్మశ్రీ'ల వంతు!
ఇండియాలో వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరించి వేస్తున్నారని ఆరోపిస్తూ, ఇప్పటికే పలువురు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రభుత్వానికి వెనక్కివ్వగా, తాజాగా 'పద్మశ్రీ' అవార్డు గ్రహీతలు ఈ జాబితాలో చేరి పోయారు. ప్రముఖ పంజాబీ రచయిత్రి దిలీప్ కౌర్ తివానా, తనకు 2004లో ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటున్నట్టు తెలిపారు. మూడు రోజల క్రితం 1971లో తనకిచ్చిన సాహిత్య పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్టు ప్రకటించిన ఆమె తాజాగా పద్మశ్రీ సైతం తనకు అక్కర్లేదని వెల్లడించారు. "గౌతమ బుద్దుడు, గురునానక్ వంటి మహనీయులు పుట్టిన చోట మత విద్వేషాలు పెరుగుతున్నాయి, ముస్లింలపై దాడులు అధికమయ్యాయి. అందువల్ల నా పద్మశ్రీ అవార్డును వదులుకుంటున్నా" అని ఆమె వెల్లడించారు. సంఘంలో మత రాజకీయాలు పెరిగిపోవడాన్ని నిరసిస్తున్నామని, దీన్ని వ్యతిరేకించేందుకు నయనతార సెహగల్ బాటలోనే తానూ నడుస్తానని ఆమె స్పష్టం చేశారు. పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ డీన్ గా ఆమె పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఓ అనువాదకురాలిగా, రచయిత్రిగా, 27 నవలలను ఆమె రచించారు.