: కనిపించని ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్'!
తమకు నచ్చిన గాడ్జెట్లను, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తక్కువ ధరకు పొందవచ్చని భావించిన యువతకు నిరాశ ఎదురైంది. నేటి నుంచి 17వ తేదీ వరకూ 5 రోజుల పాటు 'బిగ్ బిలియన్ డేస్' పేరిట వేలకొద్దీ ఆఫర్లను దగ్గర చేస్తున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ఎంతో ప్రచారాన్ని చేసింది. సరిగ్గా మంగళవారం అర్ధరాత్రి 11:59 గంటల తరువాత, 12:00 గంటలకు, అంటే, అధికారికంగా బుధవారం ప్రవేశించగానే ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ పై పొందవచ్చని తెలిపింది. తమకు నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ఒక్కసారిగా నెటిజన్లు ప్రయత్నించడంతో ఫ్లిప్ కార్ట్ యాప్ స్తంభించిపోయింది. అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల్లోనే ట్విట్టర్ వేదికగా ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్'పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ యాప్ స్పందించడం లేదంటూ వందలాది మంది ఫిర్యాదులు చేశారు. ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే సర్వర్లు మొరాయించాయని, సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. కాగా, ఫ్లిప్ కార్ట్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్, నిన్న ఉదయం 8 గంటల నుంచి 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్' పేరిట ప్రత్యేక ఆఫర్లతో విక్రయాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.