: నల్లధనం పాపం మా ఒక్కరిదే కాదు... మరో 30 బ్యాంకులు కూడా ఉన్నాయి: బ్యాంక్ ఆఫ్ బరోడా


నల్లధనం పాపంలో కేవలం తమ హస్తం మాత్రమే కాదని, మరో 30 బ్యాంకుల హస్తం కూడా ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తెలిపింది. నల్లధనం పాపాన్ని తమకు మాత్రమే అంటగట్టవద్దని బీఓబీ కోరింది. కాగా, ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ నగర్ శాఖలో ప్రారంభించిన 59 కరెంట్ అకౌంట్ ఖాతాల్లోని 38 ఖాతాల నుంచి 3,500 కోట్ల రూపాయలు హాంగ్ కాంగ్ లోని 400 కల్పిత ఖాతాల్లోకి తరలిపోయినట్టు బట్టబయలైంది. దీంతో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు బీఓబీ అంగీకరించింది. ఈ అక్రమ లావాదేవీల్లో తమ ప్రమేయం లేదని చెప్పేందుకు 33 ఖాతాలకు సంబంధించిన నగదు డిపాజిట్లు, బదిలీల వివరాలను ఫైనాన్స్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి తెలిపినట్టు బీఓబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందులో తమ తప్పేమీ లేదని, బ్యాంకు అంతర్గత ఆడిటింగ్ లో ఈ వివరాలు తెలియడంతో సీబీఐ, ఈడీలకు తామే సమాచారం ఇచ్చామని బీఓబీ చెబుతోంది. ఇందులో పాత్ర ఉందని తేలిన ఇద్దరు ఉన్నతాధికారులు, ఆడిటర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపింది. కాగా, 30 బ్యాంకుల ద్వారా 6,172 కోట్ల రూపాయల నల్లధనం విదేశాలకు తరలినట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. సీబీఐ విచారణ పూర్తయితే తప్ప అదంతా నల్లధనం అని చెప్పలేమని బీఓబీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దానిని నల్లధనంగా భావిస్తున్నప్పటికీ విచారణ అనంతరం మాత్రమే నిర్ధారించగలమని బీఓబీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News