: సినీ ప్రముఖులను చంద్రబాబు స్వార్థం కోసం వాడుకున్నారు: మంత్రి తలసాని
తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖులను తన స్వార్థం కోసం సీఎం చంద్రబాబు ఉపయోగించుకున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. "సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా కృషి చేశారు. కానీ, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమి చేశారో, ఎంత చేశారో చెప్పాలి" అంటూ తలసాని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలను ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై కూడా ఆయన మండిపడ్డారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్ పండుగల్లో వేటిని తమ ప్రభుత్వం నిర్వహించినా వివాదం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పండగలను ప్రభుత్వం నిర్వహించకూడదా? అంటూ మంత్రి నిలదీశారు.