: రచయిత సుదీంద్ర కులకర్ణికి తీవ్ర అవమానం... ముఖమంతా ఇంకు పులిమిన శివసేన శ్రేణులు
బీజేపీ నేత, రచయిత సుదీంద్ర కులకర్ణికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముఖమంతా ఇంకు రాసి శివసేన కార్యకర్తలు తీవ్రంగా అవమానించారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన ఓ పుస్తకావిష్కరణ ఇవాళ ముంబైలో జరగనుంది. ఆ కార్యక్రమాన్ని సుదీంద్ర నిర్వహిస్తున్నారు. దాన్ని శివసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రతిఘటిస్తామని కూడా ముందే ప్రకటించింది. ఈ క్రమంలో నేడు ఆ కార్యక్రమానికి వెళుతున్న సుదీంద్రను దారిలో అడ్డగించిన సేన కార్యకర్తలు మాట్లాడాలని కారు దిగమన్నారు. ఆయన కారు నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా ముఖానికి నల్లరంగు పులిమారు. దాంతో ఆయన ముఖం, బట్టలు ఇంకుతో నిండిపోయాయి. ఈ సమయంలో సుదీంద్రను సేన కార్యకర్తలు దుర్భాషలాడారు. అయితే ఇటువంటి చర్యలకు భయపడేది లేదని ఆ తరువాత సుదీంద్ర మీడియాకు తెలిపారు. పుస్తకావిష్కరణను యథావిధిగా నిర్వహిస్తామన్నారు. తనపై 15 మంది సేన కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. తరువాత దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పాక్ మాజీ మంత్రి ఖుర్షీద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకు ముఖంతోనే సుదీంద్ర అక్కడికి వచ్చారు. ఈ దాడిని ఖండిస్తున్నానని ఖుర్షీద్ అన్నారు. విలేకరుల సమక్షంలోనే పుస్తకావిష్కరణ చేశారు.