: జగన్ ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి: లక్ష్మీపార్వతి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. చిన్నవాడైనప్పటికీ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, దీక్షలతో జగన్ ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా? అందుకేనా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది? అంటూ మండిపడ్డారు. గాంధీ మార్గాన్ని జగన్ అనుసరిస్తున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను అవమానపరుస్తారా? అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దీక్షపై, ఆయన ఆరోగ్యంపై మంత్రులు ప్రత్తిపాటి, గంటా, కామినేనిలు చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ప్రత్తిపాటి, గంటాల చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. ఆనాడు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయారని విమర్శించారు. కేంద్రం నుంచి ఏపీకి ఇప్పటి వరకు రూ. 4,200 కోట్లు మాత్రమే వచ్చాయని... తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. 5,145 కోట్లను సాధించుకుందని తెలిపారు.