: సినీ నటుడు విశాల్ కు బెదిరింపులు
కోలీవుడ్ లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు, సినీ నటుడు విశాల్ కు బెదిరింపులు వస్తున్నాయి. దక్షిణ భారత చలనచిత్ర మండలి ఎన్నికలు రసకందాయంలో పడడంతో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన మేనేజర్ మురుగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాల్ ను హత మారుస్తామంటూ గుర్తుతెలియని ఆగంతుకులు ఫోన్లు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, దక్షిణ చలన చిత్ర మండలి ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ వర్గంతో... విశాల్ నేతృత్వంలోని వర్గం నాజర్ అధ్యక్ష అభ్యర్థిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా పోటీ పడుతోంది. విశాల్ వర్గానికి తమిళనాడులోని నాటక కళాకారులు మద్దతు పలుకుతున్నారు. అలాగే కమల హాసన్, ఖుష్బూ వంటి నటుల మద్దతు లభించింది. ఇదే సమయంలో విశాల్ ఎక్కడి వాడు? అంటూ రాధిక, శరత్ కుమార్ వంటి నటీనటులు స్థానికత వివాదం రేపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ విశాల్ వర్గం గెలిచే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించడంతో విశాల్ కు బెదిరింపులు వస్తున్నాయని సమాచారం. అలాగే తిరువణ్ణామలైలో నాటక కళాకారులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. విశాల్ కు మద్దతిస్తే నాటక కళాకారులుంటున్న ప్రాంతాన్ని బాంబులతో నేలకూలుస్తామంటూ ఆగంతుకులు బెదిరించినట్టు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.